Saturday, August 27, 2016

TV9 - జీరో సైజ్ జర్నలిజమ్

ఒంట్లో కొవ్వు బాగా పెంచేస్తే బీపీ చక్కెరవ్యాధి వచ్చే ప్రమాదం ఉందని ఎందరో డైటింగ్ చేయడం విన్నాం, చూశాం. ఇంకో పది అడుగులు ముందుకెసి మన హెరోయిన్లు వారి జీవనశైలినో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఎంతో అందంగా ఆరోగ్యంగా తయారవడం కూడా మనం చూశాం. ఇంకా ముందుకెళ్లి కొందరు హెరోయిన్లు జెరో సైజ్ అనే ఇంకో గొప్ప ప్రక్రియకు నాంది పలికారు. ఇదేమంటే  అస్థిపంజరానికి ఇక మూడు సెంటిమీటర్లకు దగ్గరగా వొంటిని తగ్గించేయడం. అంటే వొంట్లో కొవ్వు దాదాపు సున్నా అన్నమాట.

దీన్ని ఆదర్శంగా తీసుకున్నదో ఏమొ, టి‌వి9 అనే ఒక వార్తా-వ్యాపార సంస్థ జర్నలిజాన్ని జీరో సైజుకి తగ్గించేసింది. బహుశా జనానికి జర్నలిజం విలువ తెలిస్తే దీని వ్యాపారానికి ఎసరనేమో వ్యాపారాన్నే జర్నలిజమని చూపిస్తూనే ఉంది, చూడమని అరుస్తూనే ఉంది.

దీని పుట్టుక చూడండి!

ఒక రౌడీ ఒక ప్రజా ప్రతినిధిని చంపేస్తే, వాడిని పోలీసులు వెతుకుతూ ఉంటే,  వాడి ఇంటర్వ్యూ రోజంతా జనానికి చూపించి ప్రజాస్వామ్యప్రతినిధి శవం మీద కూడా మొరమొరాలు ఎరుకు తిన్నది!

జర్నలిజాన్ని సెన్శేషనలిజం అనే ఉరికంబానికి ప్రతిరోజూ వ్రేలాడదీస్తు చంపేసే గొప్ప వ్యాపారం దీని వ్యాపారం. ఒక వీధిలో కుక్క మనిషిని కరిస్తే అది వార్త. అక్కడితో ఆగితే జర్నలిజం బ్రతికి బట్ట కట్టేయదా! అందుకే "చూస్తూనే ఉండండి ఆ కుక్క వెనకాలే మా OB వ్యాను ఫాలో అవుతుంది రోజంతా... నిరంతర వార్తా స్రవంతి ఇదే!!"  అనే సునాకానందం వీరిది!

ఎవడో రంకు చేస్తే దాన్ని కూడా వాడేసుకోవడం, ప్రొఫెషనలిజం!

యే హెరోయిన్ ఎవడితో తిరిగిందో జనానీకెందుకు! అబ్బే అలా ఆలోచిస్తే జనం ధ్యాస పనికొచ్చే విషయాలవైపు పడి సమాజం బాగుపడిపోదా! అందుకే ఇవి కూడా వార్తల జాబితాలోకి తోసెయ్యాలి! అప్పుడే నిరంతరంగా పారుతూ ఉంటుంది "వార్తా స్రవంతి"!

మనవాళ్లు పాపం మార్స్-మిషన్  అనే ఒక అద్భుతం చేస్తే మాత్రం "దానిమీద 5 నిమిషాలే మన జనాల ధ్యాస ఉండాలి" అని అనుకున్నారో ఏమో ఈ వ్యాపారులు, అస్సలు దాని విషయాలు మనకు చెప్పరు.

దేవుడు దయతలచి ఇంటర్నెట్ అనే ఒక బ్రహ్మస్త్రాన్ని మన చేతుల్లో పెట్టాడు కాబట్టి సరిపోయింది! లేకుంటే బ్రిటిషువారు మనకు స్వతంత్రం ఇచ్చారని, మొగల్సు మన మిత్రులేనని, పాకిస్తాను వారి ఐఎస్సై వట్టి భ్రమే అని మన డబ్బుతో వ్యాపారం చేసుకొనే వీరు మన కంట్లోనే కారం కొట్టేవారు!

వార్తా వ్యాపారాన్ని జర్నలిజాన్ని వేరు చేయకపోతే రేపు జర్నలిజం సిలబస్సు మారిపోయే ప్రమాదం ఉంది, అరుపులు కేకలు వేస్తూ చెప్తే ఏదైనా వార్తాగా అమ్మేయోచ్చని మన భావితరాలకు వీరే పాఠాలు చెప్పే ప్రమాదం ఉంది!

మేలుకో ప్రేక్షకా, మేలుకో!
నీ రిమోట్ తీసుకొని, నీ డబ్బుకు విలువైన జర్నలిజాన్ని వెతికి తెచ్చుకో.

నకిలీ సరుకుని నాశనం చెయ్! తస్మాత్ జాగ్రత్త!