Sunday, July 17, 2016

జర్నలిజం కాదు అది, వ్యాపారం.


ఇది ఈ రోజు జర్నలిజం పరిస్తితి. ఈ పరిస్థితికి కారణం కూడా జర్నలిజమే. అదుపు లేని స్వేచ్చ కళ్ళెం లేను గుర్రం లాంటిది. ఒక దిశ, పరిమితి లేని గమనం ఆ గుర్రానికి ఏమిస్తుందో తెలీదు కానీ, సమాజానికి మాత్రం ఇటువంటి జర్నలిజం వల్ల ఒరిగేది మహా ప్రమాదమే తప్ప ప్రయోజనము యే మాత్రమూ కాదు.

భావ ప్రకటనాస్వేఛ్చ దాని బలం, అదే దాని బలహీనత. ఒక అదుపులేని వ్యక్తి తన స్వేచ్చని దుర్వినియోగం చేసి తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటాడో, అదుపులేని పత్రికా స్వేఛ్చ కూడా సమాజాన్ని నాశనం చేస్తుంది. 

జర్నలిజం గొప్ప మంత్రదండం లాంటిది. విలువలను పాటించే సంపాదకుడి చేతుల్లో సమాజాన్ని రక్షించే ఆయుధంలా ఉంటుంది. పక్కా వ్యాపారి చేతుల్లోకెళ్లి చేయకూడనివన్నీ చేస్తుంది. చివరకు జనం అసహ్యించుకొనే స్థాయికి సంపాదకీయాన్ని మార్చేసి అమ్ముడుపోతుంది. 

జర్నలిజం పరమావధి ప్రజలు, సమాజ శ్రేయస్సు. నిజాన్ని శోధించడం దానికున్న ఒకే ఒక కర్తవ్యం. అదే దాని ఉద్దేశ్యము. ఇవి లేనినాడు జర్నలిజం కలుపు మొక్కతో సమానం. పీకి పారెయ్యల్సిందే. 

కానీ నిజాలు చెప్పుకుంటూ పోతే సమాజం బాగు పడుతుంది సరే, పత్రిక నడిచేది ఎలా?  మరి సంపాదకుడికి పూట ఎలా గడవాలి? అందుకే పత్రికను బ్రతికించుకొనేందుకు ప్రకటనల ద్వారా, చందాల ద్వారా ధనాన్ని సేకరించడం అవసరం. అంతవరకు అంతకుమించి జర్నలిజానికి వ్యాపారం అంటకూడదు. ఇది శిలాశాసనం. 

ఈ నియమంలో తేడా వస్తే సంపాదకీయం సైడుకి పోయి మిగతావాన్నీ ప్రధాన విషయాలైపోతాయి. అసలు ఒక సంపాదకుడికి ఈ వృత్తిలో ప్రతిదినము ఎదురయ్యే సవాలు ఇదే. విలువలను వదలని సంపాదకుడు, పాఠకుల/ ప్రేక్షకుల జ్ఞానాన్నిపెంచుతూ వారి నమ్మకాన్ని గెలుచుకుంటాడు, తద్వారా పత్రికను నిలబెట్టుకుంటాడు. మిగతావారు మాత్రం మానం మర్యాదలు విడిచిపెట్టి జర్నలిజాన్ని అమ్ముకుంటాడు. 

విలువలను అమ్ముకోవడం జర్నలిజానికి కొత్త ఏమి కాదు. పత్రికా చరిత్ర మొదలైన రోజు నుండి షరా మామూలే.
నిజానికి జర్నలిజం పుట్టుకే అటువంటిది. 

మన దేశంలో 1780 లో జేమ్స్ హికే అనే ఒక ఐరిష్ వ్యక్తి మొదటి పత్రికను ప్రారంభించాడు. దానిపేరు "బెంగాల్ గెజెట్". దాని సర్కులేషన్ 200 కాపీలు. "ఎవ్వరిచే ప్రభావితం కాని రాజకీయ, వ్యాపార పత్రిక" అనే ఉప శీర్షికతో కొన్నాళ్లు హికే దీన్ని నడిపాడు. కానీ తనకున్న అపరిమిత స్వేచ్ఛను స్వలాభాలకు వాడుకుని, అప్పటి గవర్నర్ జనరల్ లోర్డ్ హేస్టింగ్స్ భార్య గురించీ వారి వ్యక్తిగత విషయాల గురించీ ముద్రించి పత్రికను నాశనం చేశాడు, జైలు పాలయ్యాడు.

రాబోవు తరాలకు పత్రికను అసలు ఎలా నడపకూడదో చెప్పడమే కాకుండా, పత్రికలవల్ల వచ్చే అనార్థాలను కూడా ఈ పత్రిక చరిత్ర చూపించింది. తరువాతి తరంలో కొందరు నీచ సంపాదకుల పుట్టుకకు కూడా నాంది పలికి, పత్రికలోకి పక్కా వ్యాపార లక్షణాలను ఎంత తేలికగా ఎలా జొప్పించవచ్చో చేసిచూపించింది ఈయన సంపాదకత్వం.

అసలు మన దేశ పత్రికా చరిత్ర అంతా కల్తీ మయమే. ఈ పత్రికా స్వేచ్ఛకు ఉన్న బలాన్ని బ్రిటీషు వారు 
గుర్తించి ఎందరో బినామీలతో ఎన్నో పత్రికలను మొదలు పెట్టడమన్నది భారతదేశ పత్రికా చరిత్ర గొప్పగా చెప్పుకోదగా విషయం.  అంత గొప్ప పత్రికా చరిత్ర మనది. బ్రిటీషు వారు వెళ్ళిపోయినా వారి ప్రతినిధులుగా ఈ పత్రికలు ఈ నాటికి పని చేస్తున్నాయంటే ఏమాత్రము ఆశ్చర్యము అవసరము లేదు. ఈ రొంపిలో కూడా ఎందరో మహానుభావులు పత్రిక విలువలను కాపాడుకుంటూ పత్రికలను నడిపారు.

కానీ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తయారయిన ఈ దేశపు దొరల ఒత్తిడులను ఎదుర్కొంటూ కూడా పత్రికలను నడుపుతున్న వారు మాత్రం కొందరే. చాలా వరకు ఈరోజు పత్రికలు టోయిలెట్లో వాడే టిష్యూ పేపర్ విలవజేయవనేది వందశాతం నిఖార్సాయిన నిజం. సుమారు 50 యేళ్ళ క్రితం మొదలైన టి‌వి విప్లవం ఈ పత్రికలకు మరో ప్రాణం పోసింది. జర్నలిజం ఒక్కసారిగా బురద పాము నుండి వేయి తలల అవతారం ఎత్తింది. బుసలు కొట్టుకుంటూ సమాజంలోని ఒక్కో అంగాన్ని భుజీస్తూ ఈరోజుకీ ఎన్నుకున్న ప్రభుత్వాలకే సవాలుగా తయారయి, ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మంచి చెడుకి హద్దులు చెరిపేస్తు అధర్మాన్ని ధర్మంగా, వ్యసనాన్ని సుగుణంగా చూపిస్తూ యువతను నాశనం చేస్తోంది.  కమ్మూనిస్టు-మార్క్సిస్టు-లెనినిస్టు భావజాలాన్ని తమ ప్రసరాల్లోకి జోప్పిస్తూ దేశాన్ని అమ్మేస్తూనే ఉంది. 

1980 తరువాత కొన్ని ప్రైవేట్ వార్తా ఛానళ్ళు భారత దేశంలో మొదలయ్యాయి. ఎక్కువమంది ప్రజలకు మరించ చేరువ అయ్యే వ్యాపారంగా మొదలయ్యి వాటి పెట్టుబడిదారుల పథకాలను ఈ దేశపు ప్రజల మీదకు అమలు పరిచాయి. నిరంతరం జనం దృష్టిని  సమాజంలో ఉన్న రుగ్మతలకు దూరంగా మళ్లించి 'యెల్లో జర్నలిజానికి' నాంది పలికాయి. 

ఒకానొక సంపాదకుడు అప్పటి దూరదర్శన్ నుండి డబ్బుని మళ్లించి సొంత జాతీయ చానెల్ను స్థాపించుకోవడం, సి‌బి‌ఐ వాడి మీద విచారణ జరిపించడం, అటు తరువాత వచ్చిన ప్రభుత్వం వాడిని కాపాడటం ఈ దేశపు టీవి న్యూస్ మీడియా చరిత్రలో కలికి తురాయి. ఇప్పటికీ ఆ చానల్ జనం సొమ్ముతో కంపెనీని విస్తరించుకుంటూ జనానికి అబధ్ధాలు చెప్తూ ట్యాక్స్ ఎగవేస్తూ నీతులు వర్లిస్తూ సమాజంలో మిగతవారికి అవార్డులు ఇస్తూ ఉంటుంది. 

నిరంతరం వార్తలు చూడాల్సినంత యేముందిరా! అని అడిగేవారు ఎందరో. కానీ జర్నలిజం స్వేచ్చా అటువంటిది. అది అందరినీ ప్రశ్నించవచ్చు. దానిని ప్రశ్నిస్తే ప్రశ్నించినవాడు సమాజనికి శత్రువైపోతాడన్నట్టు ప్రచారం చేస్తుంది.
100 ఛానెల్సుకు పైగా నడుస్తున్నది జర్నలిజమో వ్యాపారమో ఒక 10త క్లాస్ కుర్రాడు చెప్పేస్తాడు. కానీ ఈ ప్రభుత్వాలకు మాత్రం జర్నలిజాన్ని వ్యాపారాన్ని వేరు చేయాలనే ఆలోచన మాత్రం రాదు. 

బజారులో వదిలేసిన ఆంబోతు మాదిరి, ప్రతి దినం నిరంతరం మన డ్రాయింగు రూముల్లోకి ప్రవేశించి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాయజేసి వార్తల పేరుతో సొంత అభిప్రాయాలను కల్లబొల్లి మాటలను ప్రేక్షక మెదళ్ళలోకి జొప్పించి 
దేశానికి వ్యతిరేకంగా వారిలో ఆలోచనలను పుట్టించి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ వారి డబ్బుతోనే మేడలు కట్టుకుంటూ జర్నలిజం ముసుగులో వ్యాపారం చేసుకుంటూ బ్రతికేసే ఎన్నో గొప్ప ఛానెల్సు అవసరమా అని ప్రతి వాడు ప్రశ్నించాలి.

జర్నలిజాన్ని ప్రశ్నించాల్సిన అవసరం అది పుట్టినప్పటినుండి ఉంటూనే ఉంది. దాన్ని ప్రశ్నించాలంటే, దానికి ప్రత్యేక స్వేచ్చా హక్కులు కల్పించి తద్వారా ప్రత్యేక శిక్షలను కూడా ఇప్పుడున్న చట్టంలో పొందు పరచాలి.  జర్నలిజాన్ని వ్యాపారం నుండి వేరు చేయాల్సిన అవసరం మనందరిది.

మనింటికొచ్చి మన డబ్బు తీసుకొని మనల్ని కొట్టేంతగా మారి పోయిన ఈ 'ఇజాన్ని' చట్టం అనే ముక్కు తాడుతో దారికి తీసుకు రావాలి. అప్పుడే యెల్లో జర్నలిజాన్ని దాని వ్యాపారాన్ని వేళ్ళతో సహా పీకి అంతం చేసి నిజమైన జర్నలిజాన్ని బ్రతికించుకోగలమ్.

No comments:

Post a Comment